27, జులై 2010, మంగళవారం

శతజయంతి-నిడుబ్రోలు,పొన్నూరు లో..

శత జయంతి సభ -పొన్నూరు,నిడుబ్రోలు
బహుముఖ ప్రజ్ఞాశాలి కొత్త సత్యనారాయణ చౌదరి
శత జయంత్యుత్సవ సభలో పలువురు ప్రముఖుల నివాళులు

............
(భావవీణ జులై 2007 సంచిక ) ప్రసిద్ధ కవి, పండితుడు, విమర్శకుడు, కళాప్రపూర్ణ కొత్త సత్యనారాయణ చౌదరి గారి శత జయంతి సభ పొన్నూరు రొటరి కమ్యూనిటి హాల్ లో , "పొన్నూరు కళాపరిషత్ " అధ్వర్యంలో 2007 జూన్ 17 వ తేదీన ఘనంగా జరిగింది. పొన్నూరు కళాపరిషత్ అద్యక్షులు శ్రీ యస్. ఆంజనేయులు నాయుడు గారు సభాద్యక్షత వహించగా , శ్రీ పి. కృష్ణ స్వాగతం పలుకగా,ముఖ్య అతిధి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం కులపతి ఆచార్య వి . బాల మోహన దాస్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు.

సభాద్యక్షులు స్వాగతం పలుకుతూ ఎంతో ప్రాచీన చరిత్ర గల తెలుగును సుసంపన్నం చేసిన వారిలో కొత్త సత్యనారాయణ చౌదరి గారు పేరెన్నిక గలవారు , ప్రాతఃస్మరణీయులు అంటూ, వారు ఈప్రాంతానికి చెందినవారు కావడం మన అదృష్టం అన్నారు. సమాజానికి వారు చేసిన సాహితీసేవలను స్మరించు కోవడానికి ఈసభను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

సత్యనారాయణ చౌదరి గారి శత జయంతి సభలో
ప్రసంగిస్తున్న పద్మావతి కొత్త

చిన్నయ సూరి ద్విశత జయంతి, చౌదరి గారి శతజయంతులను పురస్కరించుకొని , చౌదరి గారు చిన్నయసూరి నీతి చంద్రికకు వ్రాసిన టీకను పునర్ముద్రించిన ద్రావిడ విశ్వవిద్యాలయానికి , ముఖ్యంగా కులపతి ఆచార్య జి. లక్ష్మినారాయణ గారికి ,సత్యనారాయణ చౌదరి గారి కుమార్తె శ్రీమతి కొత్త పద్మావతి కృతజ్ఞతలు తెలియ చేసారు. నీతిచంద్రికను ఆచార్య వి. బాల మోహన్ దాస్ ఆవిష్కరించారు.

ద్రావిడ విశ్వవిద్యాలయం ప్రచురించిన సత్యనారాయణ చౌదరి గారి
(చిన్నయసూరి నీతిచంద్రిక )రచనను ఆవిష్కరించిన ఆచార్య నాగార్జున
వైస్ ఛాన్సలర్ ఆచార్య బాలమోహన్ దాస్


సత్యనారాయణ చౌదరి గారి శత జయంటి సభలో
ప్రసంగిస్తున్నడాక్టర్ శేఖరం కొత్త

కొత్త సత్యనారాయణ చౌదరి గారి కుమారుడు డాక్టర్ శేషాద్రి శేఖరం నాన్న గారిని గూర్చి నాలుగు మాటలంటూ, "ఫాదర్స్ డే" నాడు ఈకార్యక్రమం జరగడం తమ అదృష్ట మన్నారు. తండ్రి పాత్రను సమర్ధవంతంగా నిర్వహించిన నాన్న గారు ఆదర్శ అధ్యాపకులుగా, సాహితీవేత్తగా విశేష సేవలందించిన ధన్యులన్నారు.

సత్యనారాయణ చౌదరి గారి రచనల సి.డి ని ఆవిష్కరించిన
శాసన సభ్యులు ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్

చౌదరిగారి రచనలు, వ్యాసాలు, ఫొటోలతోకూడిన సి.డి ని స్థానిక శాసన సభ్యులు ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ ఆవిష్కరించారు.

సత్యనారాయణ చౌదరి గారి శత జయంతి సభలో ప్రసంగిస్తున్న
వికాస్ డైరక్టర్ శంకర రావు

ఈకార్యక్రమంలో ఆత్మీయ అతిధిగా పాల్గొన్న వికాస్ విద్యాసంస్థల డైరక్టర్ శ్రీ పి.వి.శంకర రావు, చౌదరిగారి శిష్యునిగా గురువుగారితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తల్లిదండ్రులు తమకు ఆస్తులేమిచ్చారని బిడ్డలు ప్రశ్నిస్తున్న ఈరోజుల్లో,మూడు దశాబ్దాల క్రితం కీర్తిశేషులైన తమ తండ్రిగారిని గౌరవ భావంతో స్మరించుకొంటున్న కుటుంబ సభ్యులు ధన్యులని శంకర రావు గారు అన్నారు. తమవంటి వారెందరికో తమ గురువులయిన చౌదరిగారు క్రమ శిక్షణ అలవరిచారని,విద్యార్ధులను ఆలోచింప చేసేవారని, పాఠ్యాంశాలతో
పాటు అనేక విషయాలను తెలియచేస్తూ విశ్వదర్శనం చేయించేవారని, విద్యార్ధి సర్వతోముఖాభివృద్ధిని కాంక్షించే ఆదర్శ అధ్యాపకులని అభివర్ణించారు. చౌదరిగారి వంటి వారు మళ్ళీ మళ్ళీపుట్టాలని కోరుకుంటున్నానని పలుకుతూ శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన కవిత్వంలో విప్లవం,అభ్యుదయం ఉన్నాయని,కొందరు అపోహ పడుతున్నట్లు ఆయన ఏవర్గానికి వ్యతిరేకి కాదని,సనాతన ధర్మాల పేరుతొ అనాచారాలను ప్రోత్సహించే అనాచారులను మాత్రమే ఆయన వ్యతిరేకించారని శంకర రావు గారు వివరించారు.

సత్యనారాయణ చౌదరి గారి శత జయంతి సభలో ప్రసంగిస్తున్న
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం తెలుగు ప్రొఫెసర్ ఆచార్య కృపాచారి

గౌరవ అతిధులుగా కార్య్క్రమంలో పాల్గొన్న ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం తెలుగు ఆచార్యులు ఆచార్య జి. కృపాచారి మాట్లాడుతూ, తమ గురువులు ఆచార్య తూమాటి దోణప్ప గారి వలన కొత్త సత్యనారాయణ చౌదరిగారిని గురించి తెలుసుకొనే అవకాశం కలిగిందన్నారు. ఆయన స్పృశించని సాహిత్య ప్రక్రియ లేదని, వీరి వంటి బహుముఖ సాహితీపటిమ కలిగిన వారు అరుదన్నారు. చక్కని పద ప్రయోగాలతో, సామాన్యులకు కూడ అర్ధమయ్యే రీతిలో మాస్వామి, మంజరి వంటి రచనలు చేసారని, వారి పద్యాలలో భాషావిశేషాలు,చక్కని ఛందస్సంప్రదాయం, రసం, ధ్వని, అద్భుత అలంకారాలు కన్పిస్తాయని అంటూ సోదాహరణంగా వివరించారు.
తెలుగు పండితులు శ్రీ ఎన్.వి.ఆర్.ప్రసాద్, చౌదరిగారిపై వ్రాసిన పద్యాలను చదివి వినిపించారు.

సత్యనారాయణ చౌదరి గారి శత జయంతి సభలో ప్రసంగిస్తున్న
ఆంధ్ర యూనివర్సిటి తెలుగు ప్రొఫెసర్ పి సుబ్బారావు

గౌరవ అతిధి ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు ఆచార్యులు ప్రొ. పి.సుబ్బారావు ప్రసంగిస్తూ చౌదరి గారు రాజసంతో కూడిన వ్యక్తిత్వం కలవారని, తాము నమ్మిన సిద్ధాంతం విషయంలో ఎవరికే వెరవని ధైర్యశాలని, తమ ప్రతి రచన లోను గురు స్మరణ చేస్తూ గురు భక్తిని చాటిన ఆదర్శ శిష్యుడని, నలభై సంవత్సరాల పాటు అధ్యాపకుడుగా ఎందరినోతీర్చిదిద్దిన ఆదర్శ అధ్యాపకులని పేర్కొన్నారు.
నాటిరోజుల్లో త్రిపురనేని భావవిప్లవం, గిడుగు వారి భాషావిప్లవం, తిరుపతి వెంకట కవుల అవధాన ప్రక్రియ, కందుకూరి వారి సాంఘిక సంస్కరణ, రాయప్రోలు జాతీయోద్యమం, దేవులపల్లి భావవిప్లవం తెలుగు నేల నాలుగు చెరగులా వ్యాపించి ఉండగా, ప్రభావితులైన చౌదరి గారు బహుముఖ ప్రజ్ఞాశాలని అభివర్ణించారు. జీవితమంతా కూడబెట్టిన బీమా సొమ్మును కూడా పుస్తక ప్రచురణలకే వినియోగించుకొని, ఎవరికీ చేయిచాపని రాజసం ఆయనలో కనిపిస్తుందని అన్నారు. వారి కల్పవృక్ష విమర్శ, రామాయణ రహస్యాలు చదివిన తర్వాత తనకు విమర్శ, పరిశోధన,ఆలోచనా విధానం, ఎలా ఉందాలో దిశానిర్దేశం ఏర్పడిందని ఆచార్య సుబ్బారావు గారన్నారు.

సత్యనారాయణ చౌదరి గారి శత జయంతి సభలో ప్రసంగిస్తున్న
శాసన సభ్యులు ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్

స్థానిక శాసన సభ్యులు శ్రీ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ మాట్లాడుతూ ఈశతజయంతి సభ వలన మన ప్రాంతానికే చెందిన చౌదరి గారి గొప్పతనం,ప్రతిభ తమ వంటి యువకులకు తెలుసుకునేఅవకాశం కలిగిందన్నారు. సాహితీవేత్తగా ఎన్నో గ్రంధాలు రచించి, సాహితీ రంగం లో అన్ని కోణాలను స్పృశించి, తమదైన శైలిలో గుర్తింపు తెచ్చుకొన్న సాహితీవేత్త సత్యనారాయణ చౌదరి గారు చిరస్మరణీయులని నరేంద్ర కుమార్ అన్నారు.

సత్యనారాయణ చౌదరి గారి శత జయంతి సభలో ప్రసంగిస్తున్న
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య బాలమోహన్ దాస్

ముఖ్య అతిధి ఆచార్య వి. బాల మోహన్ దాస్ ప్రసంగిస్తూ కొత్త సత్యనారాయణ చౌదరి గారిని ఆవిష్కరించడానికి ఒక పూర్తి రోజు సదస్సు నిర్వహించినప్పుడే న్యాయం జరుగుతుందన్నారు. ఈసభ వలన చౌదరిగారి రచనలు తప్పక చదవాలనే ఉత్సుకత అందరిలోను కలిగిందన్నారు. గజారోహణం వంటి విశిష్ట సత్కారాన్ని అందుకున్న ధన్యులు చౌదరిగారని అభివర్ణించారు. సాహితీ సమారాధకులుగా, సాహితీ రంగంలో వారు మెట్టని చోటు, చేపట్టని ప్రక్రియ లేదని, కవిగా పండితునిగా నాటక కర్తగా కధకునిగా సరస విమర్శకునిగా సాహిత్యాభిలాషులందరికీ చిరపరిచితులని ఆచార్య బాల మోహన్ దాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల వారు చౌదరిగారిని గూర్చి వ్రాసిన పద్యాలను, ఆయన చదివి వినిపించారు. చౌదరిగారికి చాతుర్వర్ణ్య సిద్ధాంతము,అస్పృశ్యత వంటి అనాచారాలు గిట్టవని పేర్కొంటూ,ఈదుర్గుణాలు గతం లోకంటే ఇప్పుడే పెరిగాయేమో ననిపిస్తుందని, ఆవేదన వ్యక్తంచేశారు. కులాల వారీగా కాకుండా, రక్తం లోని గ్రూపుల వారీగా బంధుత్వాలు ఏర్పడితే బాగుంటుందేమో? అని అంటూ చౌదరిగారిప్పుడు ఉంటే ఈవిషయాన్ని మరింత అందంగా చెప్పిఉండే వారని బాల మోహన దాస్ పేర్కొన్నారు.ఆయన కృషిని, వ్యక్తిత్వాన్ని శతజయంతి సందర్భంగా గుర్తు చేసుకుంటూ, కృతజ్ఞతాపూర్వకంగా గౌరవించుకుంటున్న చౌదరి గారి కుటుంబ సభ్యులను ఆచార్య బాల మోహన్ దాస్ ప్రత్యేకంగా అభినందించారు.

సత్యనారాయణ చౌదరి గారి శత జయంతి సభలో ప్రసంగిస్తున్న
పండిత సత్కార స్వీకర్త,భావవాణి సాహిత్య పత్రిక సంపాదకులు కొల్లా శ్రీకృష్ణారావు

ఈసందర్భంగా, పండిత సత్కార స్వీకర్త, సాహిత్య మాసపత్రిక "భావవీణ" సంపాదకులు శ్రీ కొల్లా శ్రీకృష్ణారావు ప్రసంగిస్తూ సత్యనారాయణ చౌదరి గారు ఎంతటి పండితులో అంతటి కవులని, కాని విమర్శకులుగా వచ్చిన పేరు కవిగా రాలేదని, అసలు వారి సాహితీ సేవకు తగిన గుర్తింపు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారు ముక్కుకు సూటిగా పోయేవారని, వారికి అభిమాన సంఘాలు లేవని, భజన పరులు లేరని అన్నారు. చౌదరిగారిపై తాను వ్రాసిన పద్యాలను చదివి, సన్మానించిన నిర్వాహకులకు,చౌదరి గారి కుటుంబ సభ్యులకు,శ్రీకృష్ణారావు కృతజ్ఞతలు తెలియ చేశారు.

సత్యనారాయణ చౌదరి గారి శత జయంతి సభలో ప్రసంగిస్తున్న అనుపమ కొత్త
చౌదరి గారి మనుమరాలు చి.అనుపమ మాట్లాడుతూ, తమ తాత గారిని కలిసే అవకాశం, వారివద్ద కొత్త విషయాలను గ్రహించే అదృష్టం తనకు కలుగలేదని, అయితే ఈసభలో ఎందరో పెద్దల మాటల వలన తమ తాత గారి ప్రతిభావిశేషాలను కళ్ళారా చూసినట్లుందని పేర్కొంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
తదుపరి శత జయంతి సభలో పాల్గొన్న అతిధులకు జ్ఞాపికలతో,దుశ్శాలువలతో సత్కరించడం జరిగింది.
ఈకార్యక్రమంలో కొత్త సత్యనారాయణ చౌదరి గారి కుటుంబ సభ్యులు, కుమారులు శ్రీయుతులు దివాకర దీక్షితులు, ప్రభాకరం, కమలాకరం, రత్నాకరం,శేషాద్రి శేఖరం,కుమార్తెలు పద్మావతి, లీలావతి, కోడళ్ళు లక్ష్మి పార్వతి,విజయ,నిర్మల,మంగాదేవి, డా. మాధవి,మనుమళ్ళు శ్రీనివాస మూర్తి, , సత్యమూర్తి, రాజేష్, సత్యవికాస్,బాలాజి, మనుమరాళ్ళు జయశ్రీ, రాజశ్రీ,అనుపమ పాల్గొన్నారు.



































కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి